హైదరాబాద్, జూన్ 6: నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డీఏలు ఇవ్వకుండా.. పీఆర్సీ అమలు చేయకుండా మొండి చేయి చూపిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఐదు డీఏలకు కేవలం రెండు డీఏలనే చెల్లించాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు.
శనివారం ఆయన డాలస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మరో రెండు నెలల్లో అదనంగా ఇంకో డీఏ ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. అంటే ప్రభుత్వం ఇస్తున్నది ఒక్కటే డీఏ అని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పేందుకు ఉద్యోగ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.