హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఎండిపోయిన జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను చూసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటన చేపట్టారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవాచేశారు. మంత్రి పదవి నుంచి దిగిపోయిన కర్ణాటకకు చెందిన బోసురాజు కూడా వస్తున్నారని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటుదక్కని నేతను తీసుకొనిరావడమంటే తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనేవారులేక మహబూబ్‌నగర్ జిల్లా రైతులు రెండునెలలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారి కష్టాలపై రేవంత్‌రెడ్డి ఏనాడు సమీక్షించినా పాపానపోలేదని విమర్శించారు.
కానీ ఇప్పుడు పనిగట్టుకొని హెలికాప్టర్లో చక్కర్లు కొట్టేందుకు పాలమూరు పర్యటన పెట్టుకున్నారని ఆరోపించారు. మండుటెండల్లో కూడా శ్రీశైలం నుంచి నీళ్లను ఎత్తిపోసుకొనే అవకాశం ఉన్నదని, కేసీఆర్ దూరదృష్టితో శ్రీశైలం ఆధారంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారని చెప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్‌పై కక్షతో జూరాల నుంచి పాలమూరు జిల్లాకు నీరందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నదని దుయ్యబట్టారు. జూరాలలో లిఫ్ట్ పెడితే తెలంగాణకు బురద తప్ప నీళ్లు వచ్చే పరిస్థితిలేదని చెప్పారు. కానీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అమాయక రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్‌ల పేరిట పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సీఎం పర్యటనకు వస్తే అక్రమ నిర్బంధాలెందుకు? నిలదీస్తారని భయమా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా పర్యటన విహారయాత్రలా మిగిలిపోవద్దని, సమస్యల పరిష్కార యాత్ర కావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ హయాంలోనే 90% పూర్తిచేశారని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌ను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.