ఖమ్మం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 60శాతం జనాభా ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయని మండిపడ్డారు.
బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెడితే బీఆర్ఎస్ బేషరతుగా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరినొకరు కాపాడుకునేందుకు పనిచేస్తున్నారని, బీజేపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బదలాయించేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరస్పరం పనిచేశారని విమర్శించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని తాతా మధుసూదన్ ఆరోపించారు.