హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మ్రైక్రో బ్రూవరీస్ పేరిట ఊరూరా బీర్ షాపులు ఏర్పాటు చేసి యువత జీవితాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. అసంబద్ధ విధానాలతో రేవంత్‌రెడ్డి సర్కారు అన్ని రంగాలను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. ఆదాయం పెంపుకోసమే సర్కారు అడ్డదారులు తొక్కడం అక్రమమని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్ నూతన పాలసీలో భాగంగా ఊరుకో బీరు కంపెనీ తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా నీరా కేంద్రాలు తెరిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం పల్లెపల్లెనా మద్యాన్ని ఏరులై పారించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సర్కారు నిర్ణయాలతో యువత భవిత ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. యువతను బలిపెట్టే చర్యలను చూస్తూ ఊరుకోబోమని, సర్కారు దుర్మార్గాలను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.
కల్తీ పేరిట కల్లును నిషేధించి విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి 21 నెలల పాలనపై ఆ పార్టీ కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో నందనంలో రూ.10 కోట్లతో ఏర్పాటుచేసిన నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలని ఉంటే స్వచ్ఛమైన కల్లు, నీరా ఉత్పత్తుల తయారీ, విక్రయాలను ప్రోత్సహించాలని కోరారు.
హరీశ్‌రావు, బీఆర్ఎస్పై కవిత చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ.. ఎవరేం చెప్పినా బీఆర్ఎస్లో నంబర్‌వన్ స్థానం కేసీఆర్‌దేనని ఉద్ఘాటించారు. తెలంగాణ బాగుకోసం నిరంతరం పరితపించే ఆ మహానేతను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఆయన నేతృత్వంలోనే తెలంగాణ ప్రజల ఆశలు, ఆ కాంక్షలు నెరవేరుతాయని స్పష్టంచేశారు. తెలంగాణ సాధన కోసం అందరం అలుపెరగని పోరాటం చేశామని, హరీశ్‌రావు ముందు వరుసలో ఉన్నారని స్పష్టంచేశా రు. హరీశ్‌రావు, సంతోష్‌ను కేసీఆర్ కంటి కి రెప్పలా కాపాడుకున్నారని చెప్పారు.