మహబూబ్‌నగర్: మాగనూరు ఫుడ్‌పాయిజన్ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. సర్కార్ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న మాగనూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో చదవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత చిన్నారులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
కాగా, మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో పురుగులు బయటపడ్డాయి. గురువారం ఉదయం హాస్పిటల్ సిబ్బంది విద్యార్థులకు అల్పాహారంగా కిచిడీ అందించారు. అయితే అందులో పురుగులు కనిపించడంతో అవాక్కయ్యారు. ఫొటోలు తీసి దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి మద్దతు పలికారు. హాస్పిటల్‌కు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులు చావుబతుకుల మధ్య ఉంటే ఇలాంటి ఆహారం అందించడం ఏంటని ప్రశ్నించారు.