కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను అమలు చేస్తాం.
– అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఘనత వహించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తాం.. ఒప్పుకొంటే అమలు చేస్తాం. లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం.
– కులగణన నివేదికపై మంగళవారం నిర్వహించిన ‘ప్రత్యేక అసెంబ్లీ’ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటన ఇది!
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిన ప్రభుత్వ నివేదికపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల భవితవ్యాన్ని నిర్దేశించే, కోటాను నిర్ణయించే నివేదికను తప్పుల తడకగా ఎలా రూపొందిస్తారని మండిపడ్డాయి. మంగళవారం బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో బేగంపేటలో నిర్వహించిన సదస్సులో కులగణన నివేదిక ప్రతులను చించివేస్తున్న బీసీ నేతలు, సామాజికవేత్తలు.
Jajula Srinivas Goud | అమీర్‌పేట్, ఫిబ్రవరి 4 : కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణనలో తగిన ప్రామాణికాలు పాటించలేదని, ఫలితంగా బీసీల సంఖ్య తప్పులతడకగా వచ్చిందని, ఈ విషయాన్ని గత సెన్సస్ వివరాలతో పోల్చితే స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.
బీసీ కులగణన నివేదికలో ఊహించని విధంగా దొర్లిన తప్పిదాలను 48 గంటల్లో సరిదిద్ది, సరి చేసిన నివేదిక వివరాలను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువాల్సిందేనని డిమాండ్ చేశారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో వివిధ బీసీ సంఘాలు, మేధావులతో కలిసి మంగళవారం బేగంపేట్‌లోని హోటల్ హరితప్లాజాలో బీసీ సంఘాల సదస్సులో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు కుందారం గణేశ్‌చారి, బీసీ నాయకులు బాలరాజుగౌడ్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించడంతో బీసీ బిడ్డలు ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీ కులగణనలో వాస్తవ వివరాలను వెల్లడించేందుకు కాంగ్రెస్ జంకుతున్నదని పేర్కొన్నారు. గతంలో నెహ్రూ కాంగ్రెస్ బీసీలకు చేసిన అన్యాయాన్ని, రాహుల్ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చక్కదిద్దుతున్నదని భావించామని, అయితే రెడ్డి మార్క్ డీఎన్ఏ నుంచి ఇంకా బయటపడలేదనే విషయం స్పష్టమవుతున్నదని విమర్శించారు. బీహార్‌లో జరిగిన విధంగా బీసీల కులగణన జరిగేందుకు వీలుగా బీసీ మేధావులు చేసిన సూచనలు, సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఒక రాష్టంలోనే బీసీల కులగణన చేయలేకపోతున్న కాంగ్రెస్, ఇక దేశవ్యాప్తంగా ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీసీ కులగణనలో దొర్లిన తప్పులను సరిచేయని పక్షంలో ఈ నెల 6న బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణ యం తీసుకుంటామని జాజుల వెల్లడించారు.
సదస్సులో భాగంగా తప్పుల తడకగా ఉన్న బీసీ కులగణన సర్వే ప్రతులను చింపివేసి బీసీ ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. బీసీ కులగణన చేపట్టిన విధానమే తప్పుల తడకగా మారిందని, తొలుత జీవోలతో, ఆ తరువాత కమిషన్ల నియామకాలతో కులగణనలో బీసీ కుటుంబాల సంఖ్యను నిర్దిష్టంగా తేల్చలేదని, సంచార జాతులను పరిగణలోకి తీసుకోలేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ మంత్రి పొన్నంతో కలిసి తాను పాల్గొన్న ఓ సమావేశంలో.. కులగణన సర్వేలో పాల్గొనని వారికి తమ అభిప్రాయాలు చెప్పే అధికారం లేదంటూ మంత్రి మాట్లాడడం సరికాదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఒక రాష్ర్టానికి బీసీ కమిషన్ చైర్మన్‌గా చేసిన తన ఇంటికే సర్వే నిర్వహిస్తున్న ప్రతినిధులు రాలేదని, తానే జోనల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసిన తరువాతే తన ఇంటికి సంబంధిచిన సర్వే జరిగిందని తెలిపారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.