హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : రాష్ట్రంలోని బ్యాండ్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సంగీత కళాకారుల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్‌లో సంగీత కళాశాల ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సంగీత కళాశాల ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. సమాజంలో విశిష్ఠ స్థానం కలిగిన డప్పు, వాయిద్య కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ప్యాడ్ బ్యాండ్లను ప్రోత్సహించాలని కోరారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం పథకం, ఇండ్ల పట్టాల పంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని, అప్పుడే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, హకులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. కళాకారులు, బీసీ వర్గాలు తమ హకులు, డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అర్హులైన కళాకారులకు పెన్షన్ కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడిరాజు నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, విమలక, ఎంవీ రమణ, పైళ్ల ఆశయ్య, అంబాల నారాయణగౌడ్, చాంద్‌పాషా, హనుమంతు, భూపతి వెంకటేశ్వర్లు, బాలమురళి, కోట్ల నరసింహులు, సత్యం తదితరులు పాల్గొన్నారు.