హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం పరిఢవిల్లాలని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా అడవుల పెంపకం, పునరుజ్జీవ ఉద్యమాల్లో ఒకటైన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నందుకు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు అమరకోశం నుంచి ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ.. వైదిక విశ్వవీక్షణంలో వృక్షాల ప్రాధాన్యతను జగద్గురువులు స్పష్టం చేశారని గుర్తుచేశారు.
సంతోష్ అనే పేరులోనే ఆనందం ఉన్నదని, ఆ ఆనందం ఈ హరిత ఉద్యమం ద్వారా దేశమంతటా విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పవిత్ర ధర్మ విజయ యాత్ర’లో భాగంగా మంగళవారం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పరమ శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ (మారేడు), అమ్మవారికి ఇష్టమైన కదంబం, అన్ని పురాణాల్లో ఫలాలనిచ్చే వృక్షంగా మన్ననలు అందుకొనే పిప్పల (రావి) మొకలను విధుశేఖర భారతీ మహాస్వామి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరువు (మొక/వృక్షం)లే ఇలలో ప్రధానమని పేర్కొన్నారు. గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేసి, మానవులను ఎండ, చలి, తుఫాన్ల నుంచి కాపాడుతున్న వృక్షాలను.. ధర్మంగా భావించి ప్రతి ఒకరూ నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి తనను తాను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోగలదని కానీ, ప్రకృతే స్వయంగా తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తే.. ఆ పర్యవసానాల వల్ల వచ్చే బాధను మానవాళి తట్టుకోలేదని విధుశేఖర భారతీ మహాస్వామి హెచ్చరించారు. సనాతన ధర్మంలో వృక్షాలకు గల పవిత్ర స్థానాన్ని వివరిస్తూ ఆయన పలు సంస్కృత శ్లోకాలను ఉటంకించారు. వృక్షాలు కేవలం ఇతరుల కోసమే జీవిస్తాయని, తుఫాన్లు, వర్షాలు, ఎండ, చలిని భరిస్తూ అవి మనదాకా రాకుండా మన ల్ని రక్షిస్తున్నాయని చెప్పారు. లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవని కూడా ఒక తరువే అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. సీతాదేవికి ఆశ్రయమిచ్చి, ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసినది కూ డా అశోక వనమే కదా అని గుర్తుచేశారు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అన్నీ తరువులకే ప్రాధాన్యతనిచ్చాయని వెల్లడించారు. వృక్షాలను గౌరవించడం కేవలం ఒక సంప్రదాయం మాత్ర మే కాదని, ధార్మిక నాగరికతకే మూలస్తంభం అని చెబుతూ ధర్మశాస్త్రాలను ఉటంకించారు.