హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మాజీ సైనికులు, కుటుంబాల పునరావాసం, సంక్షేమం కోసం సేకరించే సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రంగారెడ్డి జిల్లా సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌కుమార్ ఆగ్రస్థానంలో నిలిచారు. 2024-25 సంవత్సరంలో ఆయన రూ. 15లక్షలు సేకరించడం ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక విరాళాలు సేకరించారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆయన ట్రోపీ అందుకున్నారు. 2025 -26 సాయుధ దళాల పతాక నిధి సేకరణను గవర్నర్ శుక్రవారం ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధికి రూ. లక్ష విరాళం అందించారు. డిసెంబర్ నుంచి 2026 డిసెంబర్ వరకు ఉద్యోగులు, ఎన్జీవోలు, ఎన్సీస్ క్యాడెట్ల ద్వారా విరాళాలు సేకరించనున్నట్టు సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ద్వారా.. సమాజ భద్రత, యువ నాయకత్వం, లింగ సున్నితత్వ కార్యక్రమాలు బలోపేతం చేయడానికి రెండు ముఖ్యమైన ఎంవోయూలు కుదుర్చుకున్నది. వీటిలో ఒకటి యువ నాయకత్వం, లింగ సున్నితత్వంలో ప్రత్యేకత కలిగిన హైదరాబాద్‌కి చెందిన సంస్థ రుబారో, కమ్యూనిటీ సమీకరణ, భద్రతా అవగాహన కోసం పనిచేసే యంగిస్థాన్ ఫౌండేషన్‌తో మరో ఒప్పందం చేసుకున్నది. సీఐడీ డీజీ చారుసిన్హా ఇరు సంస్థల ప్రతినిధులతో ఎంవోయూలు మార్చుకున్నారు. .