కామారెడ్డి/ఘట్కేసర్, మే 9 : ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్‌లో భాగంగా కూం బింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందిన తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు వడ్ల శ్రీధర్ (30), సందీప్ అంత్యక్రియలను శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. శ్రీధర్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా పాల్వంచలో నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్.. శ్రీధర్ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, కలెక్టర్ ఆశీ ష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర పాల్గొన్నారు.
వీరమరణం చెందిన సందీప్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శుక్రవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించారు. అంతకుముందు ఘట్కేసర్లోని సందీప్ నివాసానికి చేరుకున్న స్పీకర్ గడ్డం ప్రసాదరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్ గౌతం, రాచకొండ సీపీ సుధీర్ బాబు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు సందీప్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సందీప్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మందుపాతర పేలి ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా, సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరఫున అండగా ఉం టామని వెల్లడించారు. రూ. కోటి ఎక్స్‌గ్రేషి యా ప్రకటించారు. భద్రతా స్కీమ్‌లో రూ. 80 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం కేటా యించారు. కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.