తిరుమల : హైదరాబాద్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయలంలో ఆక్టోబర్ 11 నుంచి వైభవోత్సవాలు జరిపేందుకు తిరుమల, తిరుపతి దేవస్తానం బోర్డు (టీటీడీ) నిర్ణయించింది. ఈ వైభవోత్సవాలు ఆక్టోబర్ 11 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. ఇటీవలనే ఏపీలోని నెల్లూరు నగరంలో కూడా స్వామి వారికి వైభవోత్సవాలు నిర్వహించారు. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వైభవోత్సవాల విశేషాలను మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఆయన వైభవోత్సవాలపై అధికారులు, సిబ్బందితో వర్చువల్గా సమీక్ష జరిపారు.
తిరుమలలో జరిపే నిత్య, వారసేవలు, ఉత్సవాలను చూసే అవకాశం దక్కని భక్తులకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా తరించే అదృష్టం లభించనున్నది. ఈ ఉత్సవాలు అక్టోబరు 11 నుంచి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైభవోత్సవాల గురించి హైదరాబాద్ మహానగరంలో 10 రోజుల ముందు నుంచే ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించినట్లు జేఈఓ చెప్పారు.
హైదరబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో స్వామి వారి వైభవోత్సవ వేదికతోపాటు స్టేడియం అంతటా శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణం చేపట్టాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైనన్ని ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, అన్నప్రసాదాల పంపిణీ, రవాణా, వసతి, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భక్తులు సులువుగా గుర్తించగలిగే ప్రాంతంలో టీటీడీ పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఎండ, వానల నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా జర్మన్ షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమీక్షలో కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీమతి రాధ హర్షవర్ధన్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, వేంకటేశ్వర్లు, వీజీఓ మనోహర్, హెచ్డీపీపీ కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి, ట్రాన్స్పోర్టు జీఎం శేషారెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈఓలు గుణభూషణ్రెడ్డి, సుబ్రమణ్యం, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీహరి, హైదరాబాద్ శ్రీవారి ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.