నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 20 : శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతుండటంతో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.949 టీఎంసీల నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల, హంద్రీ జలాశయాల నుంచి 1,95,929 క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి.
ప్రాజెక్టు గరిష్ఠ నీటి సామర్థ్యం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884 అడుగుల్లో ఉన్నది. ప్రాజెక్టు ఆరు గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నాగార్జునసాగర్‌కు 2,44,132 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆదివారం డ్యామ్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,02,678 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యామ్‌కు వరద పెరగడంతో ఆదివారం ఉదయం అధికారులు రెండు గేట్లు తెరిచి దిగువన మానేర్‌కు నీటిని వదిలారు.