సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్ తన ప్రాధాన్యతలను మార్చుకుంది. కొత్తదనం కలబోసిన కథల్ని ఎంచుకుంటూ పాత్రలపరంగా ప్రయోగాలకు సిద్ధమంటున్నది. తెలుగులో ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. నరేష్ వీకే, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ నిర్మిస్తున్నారు. బుధవారం అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పెళ్లి కూతురుగా ముస్తాబై పట్టరాని ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నది అనుపమ పరమేశ్వరన్.
పెళ్లి చుట్టూ సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఆమె కీర్తి అనే పాత్రలో కనిపిస్తుందని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ధూపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గాజుల.