హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్‌డీసీ)లో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్టు అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. 30 దేశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కాన్ఫరెన్స్‌కు హాజరు కాగా, శ్రీచైతన్య విద్యా సంస్థల నుంచి 167 మంది పాల్గొన్నట్టు వెల్లడించారు. స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌కు దేశం నుంచి 28వేల మంది విద్యార్థులు పాల్గొనగా, 639 మంది శ్రీచైతన్య విద్యార్థుల భాగస్వామ్యంతో 62 ప్రాజెక్ట్‌లు ఉత్తమమైనవిగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7 ప్రాజెక్ట్‌లు మొదటి స్థానంలో, 11 ప్రాజెక్ట్‌లు రెండో స్థానంలో, 15 ప్రాజెక్టులు మూడో స్థానంలో నిలువగా, 29 ప్రాజెక్టులు మెమెంటోలు సాధించాయని తెలిపారు. తమ విద్యార్థి ప్రపంచంలోనే 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక విద్యార్థిగా నిలిచినట్టు వెల్లడించారు.