హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్ అంతరాయానికి కారణమైన జీవుల్లో తొండ, బల్లి పోయి తాజాగా ఉడుత వచ్చి చేరింది. మంగళవారం హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డినగర్‌లో విద్యుత్ తీగలపై ఉడుత పడడంతో 11కేవీ ఫీడర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఎస్ఆర్ నగర్ ఏఈ ఎక్స్‌లో పోస్టు చేశారు. గాలివాన వస్తే కరెంటు పోవడం సర్వసాధారణమే కానీ, తొండ, బల్లి, ఉడుతల వల్ల కరెంటు అంతరాయం కలుగుతోందని విద్యుత్ శాఖ అధికారులే సోషల్ మీడియా వేదికగా పేర్కొనడంపై ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తరుచూ కరెంటు కోతలతో ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిత్రం నగరంలోని గోల్కొండ చౌరస్తా (ఆర్టీసీ ఎక్స్ రోడ్డు) సమీపంలోని ప్రాంతంలో మూడు గంటల పాటు కరెంటు సరఫరా లేదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క బడ్సన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇలా గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో పదుల సంఖ్యలో విద్యుత్ అంతరాయాలపై నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీంతో కరెంటు కోతలపై విద్యుత్ అధికారులు కారణాలు వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.