హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రత్యేకంగా స్పోర్ట్స్ పీరియడ్.. వారానికి 10 గంటలు ఆటలకే. దీంట్లో పదో తరగతి వారికి కూడా మినహాయింపేమీ లేదు. ఇవి బడుల్లో ఆటలను ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ అమలుచేయనున్న నిబంధనలు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఆటలను ప్రోత్సహించాలని నిర్ణయించిన విద్యాశాఖ.. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని అమలుచేయాలని అధికారులను ఆదేశించింది.
విద్యార్థులకు ప్రధాన ఆటలతోపాటు అనాటమీ, కినిసాలజీ, ఫిజియాలజీ, సైకాలజీ, స్టాటిస్టిక్స్, యోగా, న్రూట్రిషన్ ఫుడ్, సెల్ప్ డిఫెన్స్ యాక్టివిటీస్, బ్యాలెన్స్డ్ డైట్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇక వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి ఆటలాటడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తారు. ఆటలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి స్పోర్ట్స్ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించాలని ఇప్పటికే విద్యాశాఖ నిర్ణయించింది.