ఉస్మానియా యూనివర్సిటీ, మే 9 : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని ఏఐసీసీ సభ్యుడు, నేషనల్ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ స్పెన్సర్లాల్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూ కబ్జాలకు పాల్పడుతూ సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలిని ఇబ్బంది పెడుతున్న నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన ఒక మహిళ భూమిని కబ్జా చేశారని, కోర్టులో కేసు ఉన్నందున ఆమె పేరును వెల్లడించడం లేదని పేర్కొన్నారు. శివకుమార్‌రెడ్డిపై గతంలోనూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. శివకుమార్‌రెడ్డి తన కోడలు, ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి షాడోగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించకుంటే ఈ నెల 18వ తేదీన గాంధీభవన్ ముందు ధర్నా, 19వ తేదీన గాంధీభవన్ నుంచి సచివాలయం వరకు నిరసన ర్యాలీ తీస్తామని స్పెన్సర్లాల్ హెచ్చరించారు.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం(ఆర్‌వైవీ) లబ్ధిదారులను ఎంపిక చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరుపత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాజీవ్ యువ వికాసంపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నెల 30లోగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.