యాదాద్రి, సెప్టెంబర్ 5: యాదగిరిగుట్టలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాపర్వాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. సోమవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయంలోని స్పటిక లింగాన్ని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి అర్చించారు. స్వామివారి ఖజానాకు రూ.19,13,131 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.