హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో గిరిజనులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి గిరిజన భాష మాట్లాడే సిబ్బందిని నియమించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలు, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో అందిస్తున్న సేవలపై గురువారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో అవసరం మేరకు హెల్త్ సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు ఏర్పాటు చేయాలని, ఇందుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.