Special Trains | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న 36 ప్రత్యేక రైళ్లను రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ఎస్సీఆర్ తెలిపింది. చర్లపల్లి-కాకినాడ టౌన్ (07031) రైలు మే 2 నుంచి జూన్ 27 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ రైలు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి రాత్రి 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది. కాకినాడ టౌన్ – చర్లపల్లి (07032) రైలు మే 4 నుంచి జూన్ 29 వరకు రాకపోకలు సాగిస్తుందని.. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు మార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, చర్లపల్లి-నర్సాపూర్ (07233) మధ్య మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు గమ్యస్థానం చేరనున్నది. నర్సాపూర్-చర్లపల్లి (07234) రైలు మధ్య మే 4 నుంచి జూన్ 29 వరకు నడువనుండగా.. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరనున్నది. ఈ రైలు రెండుమార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరవసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది. సెకండర్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్, జనరల్ కోచ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.