Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్- కటక్ (Train No.07165) ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు, కటక్ – హైదరాబాద్ (07166) ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 పొడిగించింది. తిరుపతి – జాల్నా (07413) ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు, జల్నా – తిరుపతి (07414) ఆగస్టు 6 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
South Central Railway
జల్నా – చాప్రా (07651) రైలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు, చాప్రా -జల్నా (07652) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు నడుస్తుందని తెలిపింది. హైదరాబాద్ – గోరఖ్‌పూర్(02575) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు, గోరఖ్‌పూర్ – హైదరాబాద్ (02576) ఆగస్టు 6 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సీహెచ్ రాకేశ్ వివరించారు. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. రైల్వేశాఖ వినూత్నంగా ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మీల్స్, తాగునీటి అందించేందుకు శ్రీకారం చుట్టింది. కొత్త స్కీమ్‌ను దక్షిణ మధ్య రైల్వేలోని నాలుగు రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది.
హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ‘ఎకనామిక్ మీల్స్’ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.20, రూ.50కి కాంబోలో మీల్స్ అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ పథకం సాధారణ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తొలి కేటగిరిలో రూ.20కు ఏడు పూరీలతో పాటు ఆలుకర్రీ, పచ్చడి ఇవ్వనున్నారు. రూ.50కి అన్నం, రాజ్మా, కిచిడీ కుల్చే, భటురె, పావ్‌భాజీ, ఛోలే, మసాలా దోశల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. సాధారణంగా అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రెండు జనరల్ బోగీలుంటాయి. ఇందులో ఒకటి ముందు, ఇంకొటి ట్రైన్ వెనుక ఉంటాయి. ఈ మీల్స్ సైతం ఆయా బోగీలకు దగ్గరలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను విక్రయిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు వివరించారు.