Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ అలగు వర్షిణి అన్ని గురుకులాల ప్రిన్సిపాల్స్, జోనల్ ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్), నాన్ సీవోఈలు, ప్రత్యేక గురుకులాలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఒకేషనల్ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులందరినీ విధుల నుంచి తప్పించాలని ఇటీవలే సెక్రటరీ రాత్రికిరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అప్పటికే సదరు ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలను కూడా చెల్లించటం లేదు. జీతాలు చెల్లించకుండా, ముందస్తు సమాచారమివ్వకుండా, అకడమిక్ ఇయర్లో అర్ధాంతరంగా తొలగించటంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఉత్తర్వులను రద్దుచేసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తుదకు మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. 3 రోజుల నాటకీయ పరిణామాల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం ముగింపు లభించింది. తొలగించిన పార్ట్‌టైం ఉద్యోగులందరినీ తిరిగి యథావిధిగా కొనసాగించాలని సొసైటీ సెక్రటరీ వర్షిణీ ఆదేశాలు జారీచేశారు. జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్స్, జోనల్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు.
బీఆర్ఎస్కు, ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక కృతజ్ఞతలు
రాత్రికిరాత్రే విధుల నుంచి తప్పించడంతో రోడ్డునపడ్డ ఫ్యాకల్టీకి బీఆర్ఎస్ నేతలు, మాజీమంత్రి హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి బాసటగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వారంతా మాజీమంత్రి హరీశ్‌రావును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి పరిస్థితికి చలించిన ఆయన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. తొలగించిన పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తోపాటు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గౌలిదొడ్డి సీవోఈని సందర్శించారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బాసటగా నిలిచారు. వెంటనే సబ్జెక్ట్ అసోసియేట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ ఒత్తిడి, మరోవైపు విద్యార్థులు, పార్ట్‌టైం ఉద్యోగుల ధర్నాతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. ఈ సందర్భంగా పలువురు పార్ట్‌టైం ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి, ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సొసైటీ సెక్రటరీకి గురుకుల విద్యాజేఏసీ కృతజ్ఞతలు
గెస్ట్ ఫ్యాకల్టీని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేయడంపై గురుకుల విద్యాజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మానవీయ కోణంలో స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 3 నెలల బకాయి వేతనాలను కూడా సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కృతజ్ఞతలు తెలిపినవారిలో గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ బాలరాజు, ప్రభుదాస్, బాలస్వామి, యాదయ్య, రుషికేశ్కుమార్, చలపతి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ సర్కారులో గురుకులాలు నిర్వీర్యం ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం
సాంఘిక సంక్షేమ గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం విమర్శించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్వేరోస్ ఇంటర్నేషనల్, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం, స్వేరోస్ నెట్వర్క్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సయ్య, కార్యదర్శి సుంకరి వెంకటేశ్, కోకన్వీనర్ బానోతు రాంబాబు, స్టూడెంట్ ఫౌండేషన్ చైర్మన్ విజయ ఆర్య క్షత్రియలు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాలపై కాంగ్రెస్ కక్ష కట్టిందని, విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్ చాపల సదానందం, మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లలితా రాణి, వెంకటేశ్, స్వేరోస్ ఇంటర్నేషనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలకబత్తిని వీరయ్య, ప్రకాశ్, గిరిజన విద్యార్ధి సమాఖ్య అధ్యక్షుడు వెంకట్ బంజారా తదితరులు పాల్గొన్నారు.