హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచే భాగస్వాములు కావాలని సూచించారు. మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ ముగ్గురికి ఆదర్శంగా నిలవాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. మూడు మొకలు నాటే ఈ సవాల్‌ను స్వీకరించండి. ఈ చిన్న ముందడుగుతో మనం హరిత భవిష్యత్తు కోసం పెద్ద మార్పును తీసుకురావచ్చు. మన భూమండలాన్ని సంరక్షించే, పచ్చదనంతో నింపే కార్యక్రమంలో పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవండి. మీరు మూడు మొక్కలు నాటి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయండి.
మీ స్నేహితులను ట్యాగ్ చేసింది. వారిని కూడా మూడు మొక్కలు నాటమని చాలెంజ్ విసరండి. సమిష్టిగా మొక్కలు నాటి హరిత సేనగా మారండి. భావితరాల కోసం మార్పును సృష్టించండి. ప్రతీమొక మన సుస్థిర భవిష్యత్తు కోసం లెకించినట్టవుతుంది. ఇప్పుడే మొక్కలు నాటడం మొదలు పెట్టండి అని సంతోష్‌కుమార్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.