Telangana |జాతీయ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని జనం తేల్చిచెప్తున్నారు. బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభకు ప్రజలు రాలేదు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకూ జనం హాజరుకాలేదు. అటు తమకు ఎదురులేదని కోమటిరెడ్డి ప్రచారం చేసుకుంటున్న నల్లగొండ సభలోనూ.. ఇటు బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఆయా పార్టీల జాతీయ అధ్యక్షులు హాజరైనా జనం అటువైపు తొంగిచూడలేదు. ఇక పీసీసీ అధ్యక్షుడి సభల్లో
ప్రసంగాలు వినేందుకు జనం కరువయ్యారు. గురువారం దుబ్బాక, మానకొండూర్, జమ్మికుంట మూడుచోట్లా రేవంత్ సభల్లో ఖాళీ కుర్చీలే కనిపించినయ్. జనం రాలేదు.. వచ్చినోళ్లు ఆగలేదు! ఇది ఢిల్లీ పార్టీలకు తెలంగాణ ప్రజలిస్తున్న స్పష్టమైన సంకేతం. సోషల్‌మీడియాలో గాలి.. క్షేత్రస్థాయిలో ఖాళీ! అదే సమయంలో బీఆర్ఎస్ సభలకు జనం పోటెత్తుతున్నారు. కేసీఆర్ సభలు జనసునామీలను తలపిస్తుంటే.. కేటీఆర్, హరీశ్ వంటి నేతల రోడ్‌షోలకు అశేష జనాదరణ, విశేష ప్రజాస్పందన కనిపిస్తున్నది.
కరీంనగర్/దుబ్బాక/దుబ్బాక టౌన్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): జనం లేక.. వచ్చినోళ్లూ కూడా ఆగకపోవడంతో కాంగ్రెస్ విజయభేరి సభలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ఏస్కొని సభలకు హాజరైనా ప్రజలనుంచి స్పందన కరువైంది. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోని హుజూరాబాద్, మానకొండూరు, దుబ్బాక నియోజకవర్గాల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలను నిర్వహించింది. ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభలకు జనాలు అంతంతే రాగా.. వచ్చినవాళ్లనుంచీ స్పందన కరువైంది. సభలు పేలవంగా ఉండటంతో రేవంత్ ప్రసంగం ప్రారంభానికి ముందే జనం వెనుదిరిగారు. అందరూ కూర్చోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత బతిమిలాడినా ప్రజలు పట్టించుకోలేదు. రేవంత్ ప్రసంగించే సమయానికి పట్టుమని పిడికెడు మందికూడా లేరు. దీంతో ఆయన ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది.
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన రేవంత్ బహిరంగ సభకు వచ్చిన ప్రజలు వచ్చినట్టుగానే వెళ్లిపోవడం కనిపించింది. వెళ్లిపోతున్న జనాన్ని ఆపేందుకు కాంగ్రెస్ నాయకగణం నానా తంటాలు పడాల్సి వచ్చింది. కుర్చీల్లో కూర్చోవాలని పదేపదే మైక్‌లో చెప్పినా ప్రజలు వినకుండా వెళ్లిపోయారు. రేవంత్ వచ్చి మాట్లాడుతుండగా జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. మాట్లాడుతుండగానే మైదానంలోంచి ప్రజలు వెళ్లిపోతుండటం కనిపించింది. దీంతో రేవంత్ హడావిడిగా తన ఉపన్యాసం ముగించుకొని రేణికుంటకు బయలుదేరారు.
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంటలో నిర్వహించిన సభ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. సభకు రేవంత్ రాకముందే జనాలు వెళ్లిపోయారు. రేవంత్ మాట్లాడినప్పుడు పట్టుమని వెయ్యి మందికూడా జనాలు లేరు. హడావిడిగా ప్రసంగించి వెళ్లిపోయారు.
దుబ్బాకలో రేవంత్ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్‌పై దుబ్బాక జనం తీవ్ర విముఖత చూపారు. ఈ సభకు సూమారు 30 వేల మందికిపైగా తరలించాలని ఆ పార్టీ నేతలు భావించారు. అయినా జనం నుంచి స్పందన రాకపోవడం.. వచ్చిన జనంకూడా ఓ 5-10 నిమిషాలు ఉండి వెనుదిరగడంతో టీపీసీసీ చీఫ్ ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ హెలికాప్టర్ ఏస్కొని వచ్చినా సభలు తుస్సుమన్నాయంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్ నాయకుల గాలిముచ్చట్లు వినేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని చెప్పేందుకు ఈ సభలే సంకేతమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక హుజూరాబాద్, దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్నుంచి బీజేపీలో చేరడం, దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రేవంత్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని అత్యంత బలహీన అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ చావుకు కారణమయ్యారు. ఆ ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తున్నదని ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నాడు బీజేపీతో రేవంత్ చేతులు కలపడం వల్లే ఈ రెండు చోట్లా కాంగ్రెస్ కనుమరుగైందని, అందుకే కాంగ్రెస్ విజయభేరి సభలకు జనాలు రాలేదని చెప్తున్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో కాంగ్రెస్‌ను చంపిన పాపం రేవంత్‌దేనని మండిపడుతున్నారు.
50 ఏండ్లు అరిగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల్లో ఆదరణ తక్కువ. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీని ప్రజలెవ్వరూ స్వాగతించలేదు. దీంతో ఈసారి ఆ పార్టీ సరికొత్త మైండ్‌గేమ్‌కు తెరలేపింది. సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారని, తమకు ప్రజల మద్దతు ఉన్నదని చెప్పుకొనేందుకు ఓ ట్రిక్ ప్లే చేసింది. సభ పెట్టిన ప్రతిచోటా చిన్న స్థలాన్ని ఎంపిక చేసుకొన్నది. ఓ నియోజకవర్గంలో సభ ఉంటే ఆ పక్కన ఉన్న నియోజకవర్గాలనుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలను తరలించింది. మొత్తంగా తమ సభలకు పెద్దసంఖ్యలో జనాలు వస్తున్నట్టు సీన్ క్రియేట్ చేసింది. అయితే, కాంగ్రెస్ నాయకుల మాటలు.. చేష్టలు నచ్చక సభలకు వచ్చేందుకు ప్రజలు విముఖత చూపారు. మొదట రెండు, మూడు రోజులు సభలు ఫుల్ అయినట్టు చూపించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత సభలనుంచి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ట్రిక్కులు కొద్దిరోజులు పనిచేసినా.. ఇప్పుడు పనిచేయడం లేదు. ఇతర ప్రాంతాల వాళ్లు సభలకు రావడంలేదు.. వచ్చినవాళ్లు కూడా స్పందించడం లేదు. చిన్న స్థలంలో సభ పెట్టినా జనం నిండటంలేదు. కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నయ్. దీంతో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్రావుఠాక్రే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరైనా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ హెలికాప్టర్ ఏస్కొని వచ్చినా ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
నిజామాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ పూర్తిగా వెలవెలబోయింది. గిరిరాజ్ కళాశాల మైదానంలో గురువారం బీజేపీ నిర్వహించిన ప్రచార సభకు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టే సమయానికి మైదానంలో సగానికి పైగా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇదిచూసి నివ్వెరపోయిన నడ్డా దిక్కుతోచని స్థితిలో నాలుగు మాటలతోనే ప్రసంగాన్ని ముగించేశారు. సభలో జనాలే లేకపోవడంపై ఆయన స్థానిక లీడర్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ నేతలంతా నాలుగైదు రోజుల నుంచి ఆపసోపాలు పడుతూ జనాలను తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నవంబర్ 15న ఇదే మైదానంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రచార సభ జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఆ సభకు ప్రజలు పోటెత్తారు.
జనంలేని సభను చూసి నిరుత్సాహపడిన నడ్డా.. కొద్దిసేపే మాట్లాడినప్పటికీ అన్నీ అసత్యాలే వల్లించాడని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసిన మేలును ఇసుమంతైనా వివరించలేదు. హిందీలో చేసిన ప్రసంగానికి ఇందూరు వాసులెవ్వరూ అంతగా స్పందించలేదు. ఆద్యంతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపిన నడ్డా.. గాలి కబుర్లు, కల్లబొల్లి మాటలే చెప్పారు. చివరకు తమ మ్యానిఫెస్టోను సైతం సరిగా వివరించలేకపోయారు.