హైదరాబాద్, అక్టోబరు 27 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డులు సాధించేందుకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మ రం చేసింది. కొత్త విధానంలో అవార్డుల ఎంపిక ప్రకియతో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం అవార్డు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ స్పెష ల్ ఆఫీసర్‌గా నియమించారు. తన సత్తాను చాటేందుకు తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డుల కోసం ప్రయత్నిస్తున్నది. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేసి పొందుపరిస్తే తప్పకుండా అవార్డులు దక్కుతాయనే అంచనాతో అధికారులున్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. వీరంతా.. అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పంచాయతీ అవార్డులను ఈసారి తొమ్మిది విభాగాలకుగాను 113 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈసారి పంచాయతీ అవార్డుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలనే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ, విద్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యుత్తు శాఖ, సంక్షేమ శాఖలు, రోడ్లు భవనాలు, రవాణా, అటవీ శాఖ తదితర శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవలే ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే ముందున్నది.
నగదు బహుమతి…
జాతీయ స్థాయిలో తొమ్మిది విభాగాల్లో ఒక్కో విభాగానికి ఎంపికైన పంచాయతీలకు మొదటి బహుమతి కింద రూ.50 లక్షలు, రెండో బహుమతికి రూ.40 లక్షలు, మూడో బహుమతికి రూ.30 లక్షలు అందిస్తారు. ఇదే తరహాలో ఉత్తమ మండలాలకు అవార్డులిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ జిల్లాలకు మొదటి బహుమతి రూ.1.50 కోట్లు, రెండో బహుమతికి రూ.1.25 కోట్లు, మూడో బహుమతికి రూ.కోటి ఇస్తారు.
షెడ్యూల్ …
ఈ నెల 31లోపు ఆయా గ్రామాలు చేపట్టిన కార్యక్రమాలు ఇతర వివరాలను ఆన్లైన్లోనే నమోదు చేయాలి. జిల్లా స్థాయి జాబితాను నవంబరు 16 నుంచి డిసెంబర్ 16 వరకు, రాష్ట్ర స్థాయిలో 2023 జనవరి 31లోపు ఎంపిక చేయాల్సి ఉంటుంది. మార్చి 31లోపు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైన వాటిని ప్రకటిస్తారు. 2023 ఏప్రిల్ 24న అవార్డులు అందజేస్తారు.
అవార్డు ఎంపికకు అంశాలివే..
1) పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు
2) చైల్డ్ ఫ్రెండ్లీ
3) మహిళా స్నేహాపూర్వక పంచాయతీ
4) గ్రామాల్లో సుపరిపాలన
5) ఆరోగ్యకరమైన పంచాయతీ
6) స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు
7) సామాజిక భద్రత
8) పచ్చదనం, పరిశుభ్రత
9) నీరు సమృద్ధి