Rythu Bharosa | హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే ధ్యాసతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. వెంటనే రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రక్రియను మంగళవారమే చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా, తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
రైతులకు, కౌలురైతులకు కూడా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రైతుభరోసా అందరికీ కాదు కొందరికే అన్న చర్చను లేవదీసింది. దీనిపై అసెంబ్లీలో చర్చించిన తరువాత విధివిధానాలు ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం నిబంధనలనే రైతుభరోసాకు కూడా వర్తింపజేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో రాష్ట్రంలోని సగంమంది రైతులకు రైతుభరోసా అందదని, ఫలితంగా వ్యవసాయరంగం మళ్లీ సంక్షోభంలోకి వెళ్తుందనే ఆందోళన వ్యక్తమైంది.
రైతుబంధు స్ఫూర్తికే తూట్లు
రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించి వారిని అప్పులపాలు కాకుండా కాపాడుకోవడం, ప్రతి ఎకరా భూమిని సాగులోకి తీసుకొనిరావడం తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పదాకతలను పెంపొందించడం, వ్యవసాయరంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడం అనే మహోన్నత లక్ష్యాలతో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధుకు శ్రీకారం చుట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ పథకం స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొందరికే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా అమలుకు విధివిధానాలు నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రైతుభరోసా నిబంధనల్లో మార్పులపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల తెలిపారు.
మంగళవారం రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ నిబంధనలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. రైతుభరోసాను ఆలస్యం చేసేందుకే సబ్‌కమిటీ ఏర్పాటు చేశారన్న బీఆర్ఎస్ విమర్శలను ఆయన తప్పుపట్టారు. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ‘సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్షన్ మాస్టర్’ అంటూ ప్రభుత్వ పథకాల్లో కోతలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లు అని పేర్కొన్నారు.