హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులను అప్రమత్తం చేసింది. దీనిలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేశారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుద్ధ్యంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు.
ఈ మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ శాఖ సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఇటీవల సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను, సిబ్బందిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యంపై అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో దోమల బెడదను నివారించేందుకు నిరంతరం ఫాగింగ్ చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్, ఇతర పారిశుద్ధ్య సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ నీటిని క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని, హోటళ్లు, మాంసం దుకాణాలపై నిఘాపెట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మున్సిపాలిటీల్లో..
పట్టణాల్లో అపరిశుభ్రతకు ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, మురుగు కాలువల్లో పూడిక తీయాలని మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని ఆదేశించింది. తగినంత బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్‌ను అందుబాటులో ఉంచుకోవాలని, లోత ట్టు ప్రాంతాల్లో నీరు నిలిస్తే సిల్ట్ క్లియర్ చేసి క్రిమిసంహారకాలను చల్లాలని స్పష్టంచేసింది. కంటెయినర్లు, ట్యాంకులు, డ్రమ్ములు, మట్టి పాత్రలు, కొబ్బరి చిప్పలు, టైర్లలో దోమల వృద్ధిని అరికట్టేందుకు వారానికోసారి స్ప్రెడింగ్ ఆయిల్‌ను పిచికారీ చేయాలని, ఈగల బెడద ఉన్న చోట నువాన్ను చల్లాలని సూచించింది. కబేళాలు, మారెట్లు, పబ్లిక్ టాయిలెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నది.