హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం, ఇవాన్‌స్టన్‌లోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19న జరిగే ‘కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్-2025’కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాలని కేటీఆర్‌కు కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖ రాశారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి వినూత్న ఆలోచనలతో తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందిందని, అది దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ వేదికగా భారత్‌లో పెరిగిన ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి, సాంకేతికరంగంలో వస్తున్న ఆ విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలోని బిజినెస్ సూల్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని కేటీఆర్ మెప్పించి ఒప్పించిన తీరు అందరికీ ఆదర్శమని చెనాక్షా పేరొన్నారు. ఈ డిజిటల్ యుగంలో యువతకు హైదరాబాద్‌ను ఉపాధి అవకాశాలగనిగా తీర్చిదిద్దడం అద్భుతమని కొనియాడారు. ఔత్సాహికులైన యువతను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కేటీఆర్ వేసిన ప్రణాళికలు తెలంగాణలో గొప్ప ఫలితాలు సాధించాయని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా కేటీఆర్ పదేండ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా బంగారు బాటలు వేశారని అభినందించారు.
స్వల్ప కాలంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి సాధించేందుకు కేటీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా దశాబ్దకాలంలో రూపొందించిన ప్రణాళికలు, సాధించిన విజయాల తాలూకు అనుభవాలను విద్యార్థులకు వివరించాలని లేఖలో విజ్ఞప్తిచేశారు. సుస్థిర అభివృద్ధికి ఎలా పునాదులు వేయాలో, పరిపాలనలో సాంకేతికతను జోడించి, మెరుపు వేగంతో ఎలా మెరుగైన ఫలితాలు సాధించాలో సూచనలు చేయాలని కోరారు.