నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘టీఆర్ఎస్తోనే మునుగోడులో అభివృద్ధి మొదలైంది. మధ్యలో చేసిన పొరపాటుతో మళ్లీ నిలిచిపోయింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్న సంపూర్ణ విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. క్షేత్రస్థాయిలో నా ఎన్నికల ప్రచారానికి వస్తున్న స్పంద నే అందుకు నిదర్శనం. సీపీఐ, సీపీఎంలు తోడు కావడంతో టీఆర్ఎస్కు ఎదురులేదని సామాన్యులు సైతం భావిస్తున్నారు. అభివృద్ధికి ఓటేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం ఖాయం’ అని టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన ప్రభాకర్‌రెడ్డి.. గురువారం నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రచారం ఎలా సాగుతున్నది? ప్రజల స్పందన ఎలా ఉన్నది?
నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్తోపాటు సీపీఐ, సీపీఎం శ్రేణులు విస్తృతం గా ప్రచారం నిర్వహిస్తున్నా యి. నేను కూడా ఇప్పటికే మునుగోడు మండలంలో ప్రచారాన్ని పూర్తిచేశా. ప్రచారంలో గ్రామాలకు గ్రామాలే కదలివస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారధ్యంలో అమలువుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది.
ప్రధాన ప్రచార అంశాలేమిటి?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు మునుగోడులో జరిగిన అభివృద్ధినే ప్రజలకు వివరిస్తున్నాం. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి మోసాలను ఎండగడుతున్నాం. 2018లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధిని పట్టించుకోకుండా మధ్యలోనే రాజీనామా చేశారు. రాజీనామా మాటున దాగిఉన్న 18 వేల కోట్ల కాంట్రాక్టు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని వ్యాపారాల కోసం బీజేపీకి ఎలా తాకట్టు పెట్టా రో విడమర్చి చెప్తున్నాం. ప్రజలు అర్థం చేసుకొని రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వ్యవహారంపై ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
రాజగోపాల్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే. స్వార్థం, అబద్ధాలు, డబ్బు అహంకారానికి మారుపేరు. రాజీనామాకు ముందు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు దక్కినట్టు రాజగోపాల్‌రెడ్డే స్వయంగా ఒప్పుకొన్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. దీంతో ఇప్పుడు తడిబట్టలతో ప్రమాణాలు, ఇమానాలు అంటున్నారు. తడిబట్టతో నమ్మిన వారి గొంతు కోయడం వీళ్లకు అలవాటు. నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆత్మగౌరవాన్ని కాంట్రాక్టు కోసం తాకట్టు పెట్టారు. ఇప్పుడు వీళ్ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి పోయారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు.
ప్రచారంలో సీపీఐ, సీపీఎంల సహకారం ఎలా ఉన్నది?
మతోన్మాద బీజేపీ ఓటమికి సీపీఐ, సీపీఎంలు కంకణం కట్టుకున్నాయి. సీపీఐ, సీపీఎంలు కలిసిరావడంతో కొత్త ఉత్సాహం నెలకొన్నది. మూడు లౌకిక పార్టీలు కలిసి కార్యక్షేత్రంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో గులాబీ జెండాలకు ఎర్ర జెండాలు తోడుకావడం మునుగోడులో ఎదురులేదన్న భావన నెలకొన్నది. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలతో సమన్వయంగా ప్రచారం సాగుతున్నది. రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలన్న కసితో కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు. మునుగోడులో విజయం ద్వారా ఈ కలయిక రానున్న కాలంలో దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నా.
మీరు గెలిస్తే మునుగోడుకు ఏం చేస్తారు?
రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మూడున్నరేండ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచాకే మునుగోడు అభివృద్ధి బాట పట్టింది. దీన్ని తిరిగి కొనసాగించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిస్తూ ఫ్లోరైడ్‌కు చెక్ పెట్టాం. సాగునీటి కోసం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయించడమే లక్ష్యంగా పనిచేస్తా. ప్రధాన రహదారులను, అంతర్గత రోడ్లను, డ్రైనేజీ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తా. విద్య, వైద్యపరంగా మరిన్ని సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతా. మునుగోడు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.
కారు గెలిస్తేనే మునుగోడు బాగుపడ్తది
గర్భవతులు, బాలింతలను కేసీఆర్ సర్కారు మంచిగా చూసుకుంటున్నది. చేతగాని ముసలోళ్లు ఇంటి దగ్గరనే బిందెతో భగీరథ నీళ్లు పట్టుకునేలా చేసిండు. రైతు చచ్చిపోతే రైతుబంధు కింద ఐదు లక్షలు ఇస్తుండు. ఇంకేం కావాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టు ఉజ్జిని నారాయణరావు ఎమ్మెల్యేగా ఉన్నడు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యే అయిండు. ఎవరూ అభివృద్ధి చేసింది లేదు. కోమటిరెడ్డి అన్నదమ్ములు దొంగలే. నేను ఎవ్వరికీ భయపడను. నన్నేం చేయలేరు. నా ఇంటి సమస్యను చెప్తే పట్టించుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ రాజగోపాల్‌రెడ్డి గెలిచి ఏం చేస్తడు. కారు ఫుల్లు ఉండాలే. మునుగోడు బాగుపడాలే. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకొంటాం.
–బండి జంగమ్మ, రాంరెడ్డిపల్లి, మం: మర్రిగూడ