హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవరసరమని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్లపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్గా పరిగణించాలని, తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్స్టేషన్లలో 330 అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని కొనియాడారు. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ పోక్సో కేసును త్వరగా దర్యాప్తు పూర్తిచేసి నిందితునికి 20 ఏండ్ల పడేలా కృషిచేసిన దర్యాప్తు అధికారులను డీజీపీ అభినందించారు. పుష్పగుచ్ఛాలతోపాటు ప్రశంసాపత్రాలు ఇచ్చి సతరించారు.