హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంట్ స్టేటస్ కల్పిం చి వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగంగా గుర్తించాలని ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సంస్థ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర విత్తనరంగ అభివృద్ధిలో అధికారుల పాత్ర, ఉద్యోగుల సమస్యలపై చర్చిం చి పలు తీర్మానాలు చేశారు. తమిళనాడు మాదిరిగా ఇక్కడ కూడా సీడ్ సర్టిఫికేషన్‌కు డిపార్ట్మెంట్ స్టేటస్ ఇవ్వాలని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగుల పెన్షన్‌ను రూ.30వేలకు పెంచాలని, కాంట్రాక్ట్ ఫీల్డ్ ఆసిస్టెంట్లను ఏఈవోలుగా పరిగణించి వేతనాలు పెంచాలని తీర్మానించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ విత్తన ధ్రువీకరణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ పెబ్బేటి మహేశ్, అధ్యక్షుడు జయ ప్రకాశ్, అగ్రీ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తిరుపతి పాల్గొన్నారు.