హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మొదలు కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రగతిభవన్‌లో గ్రామపంచాయతీ కారోబార్, బిల్ కలెక్టర్ల క్యాలెండర్‌ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పనికి తగిన వేతనాలు, గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సిబ్బంది భయంతో కాకుండా ప్రేమతో పనిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించాలని కోరారు.
జీవో 51ని రద్దుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అర్హత గల బిల్ కలెక్టర్లను పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించడం రాష్ట్ర వ్యాప్తంగా, జనాభా ఆధారంగా గ్రామాలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ, ప్రతి గ్రామానికి ట్రాఫిక్ ప్యాటర్న్ నిర్ణయించాలని ఈ సందర్భంగా మంత్రిని కారోబార్, బిల్ కలెక్టర్ల అసోసియేషన్ నాయకులు కోరారు. కార్యక్రమంలో బిల్ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆరే నాయుడు, పంచాయతీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్‌మోహన్, తెలంగాణ పంచాయతీ కార్యాలయ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య యాదవ్, గౌరవ సలహాదారు రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షుడు మునావర్, వివిధ జిల్లాల నుంచి బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.