హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్లు ఖరారు చేశారు. పాఠశాల అభివృద్ధికి పది లక్షలు విరాళం ఇచ్చే దాతల పేర్లను పాఠశాలకు లేదా తరగతి గదికి పెట్టేందుకు అవకాశం ఇచ్చారు. 2 లక్షలు ఇస్తే పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)లో సభ్యుడిగా జాబితాలో చేర్చుతారు. ఈ పథకం కోసం రూ.7,289.54 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలనా పరమైన అనుమతులిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం జీవో 4 జారీచేశారు. మొదటి విడుతలో 2021-22 విద్యాసంవత్సరంలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో వసతులు కల్పిస్తారు. మండలం యూనిట్‌గా ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలను ఎంపికచేసి మొదట ఈ పథకాన్ని అమలుచేస్తారు. స్కూళ్లవారీగా పనులకు అంచనాలు రూపొందించి, స్కూళ్లవారీగానే పరిపాలనా అనుమతులు జారీచేస్తారు. జిల్లా కలెక్టర్లు ఈ అనుమతులిస్తారు. ఇందుకు పలు శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాలను ఏజెన్సీలుగా ఎంపికచేస్తారు. ఒక మండలంలో ఒకే ఏజెన్సీ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఏజెన్సీలు సాంకేతిక అనుమతులిచ్చిన తర్వాత, కలెక్టర్లు పరిపాలనా పరమైన అనుమతులిస్తారు.
పథకం పూర్తిగా పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఆధ్వర్యంలోనే అమలవుతుంది. పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తారు. పెయింటింగ్, చిన్నచిన్న రిపేర్లు వంటి పనులకు ఎస్‌ఎంసీలే అనుమతులులిస్తాయి. ఎస్ఎంసీలు ముందురాని పక్షంలో జిల్లా కలెక్టర్లే చర్యలు చేపడతారు.
ఈ పథకం కోసం నిధులను వివిధ శాఖల నుంచి సమీకరిస్తారు. సమగ్ర శిక్ష, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, నాబార్డ్, జిల్లా గ్రంథాలయ సంస్థల నిధులను వినియోగిస్తారు. నిధుల సమీకరణకు నోడల్ ఏజెన్సీగా ఆర్థికశాఖ వ్యవహరిస్తుంది. ప్రతి నెలా కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్‌గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కేటాయిస్తుంది.
పథకం అమలు పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఐటీ విభాగం దానిని ఖరారు చేస్తుంది.
నిధులను అత్యంత పారదర్శకంగా విడతలవారీగా ఎస్ఎంసీకే కేటాయిస్తారు. ఇదంతా సాఫ్ట్వేర్, ఎంబీ రికార్డింగ్ ఆధారంగా జరుగుతుంది. కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఎస్ఎంసీలకు రివాల్వింగ్ ఫండ్‌గా విడుదల చేస్తారు.
ఈ నిధుల్లో నుంచి 1/3 వంతు వినియోగించి పనులు చేపట్టగానే, ఖర్చుచేసిన మొత్తాన్ని బట్టి ఎస్ఎంసీకి రీఇంబర్స్ చేస్తారు.
పాఠశాల స్థాయిలో చెక్కులు, చెల్లింపులన్నీ ఎస్ఎంసీ చైర్పర్సన్, ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్ ఇంజినీర్, సర్పంచ్‌లతో కూడిన కమిటీ సంయుక్తంగా చేపడుతుంది.
పాఠశాల స్థాయిలో నిధుల వినియోగానికి ఎస్ఎంసీ తీర్మానం చేసి, సంతకాలు చేసి చెక్కులను జారీచేయాలి.
ఎవరైనా పాఠశాలకు రూ.10 లక్షలు విరాళమిస్తే, ఆ దాత లేదా వారు సూచించిన పేరును తరగతి గదికి లేదా పాఠశాలకు పెడతారు. రూ.2 లక్షలు విరాళమిస్తే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో తీర్మానం చేసి, ఆ దాత పేరును ఎస్ఎంసీ సభ్యుడి జాబితాలో చేరుస్తారు.
పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్ వంటి సామగ్రిని రాష్ట్రస్థాయిలోనే ఏకమొత్తంగా (బల్క్‌గా) సేకరించి స్కూళ్లవారీగా పంపిణీ చేస్తారు. డ్యూయల్ డెస్క్ బల్లలు, డిజిటల్/స్మార్ట్ క్లాస్‌రూం పరికరాలు, పెయింట్స్, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రిన్సిపాల్, స్టాఫ్ రూం ఫర్నిచర్, ఉన్నత పాఠశాలలకు గ్రంథాలయ ఫర్నీచర్, కంప్యూటర్ ఫర్నిచర్, సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ వంటివాటిని రాష్ట్రస్థాయిలో కొనుగోలు చేస్తారు.
రైతు వేదికల తరహాలో సిమెంట్‌ను నిర్దేశిత ధరకే (ఫిక్స్డ్ ప్రైజ్) సరఫరా చేస్తారు.
సివిల్ పనులకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందిస్తారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపడతారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ (ఎస్ఏఏటీ) ఈ పథకంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహిస్తుంది.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేస్తారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఒక శాతాన్ని సాఫ్ట్వేర్, పీఎంయూ సిబ్బంది పారితోషికాలు, శిక్షణ, ఇతర ఖర్చుల కోసం వెచ్చిస్తారు.
మంజూరుచేసిన నిధులపై సమకూరే వడ్డీ మొత్తాన్ని స్కూళ్ల నిర్వహణకు ఉపయోగిస్తారు.
ఈ పథకం కోసం రూపొందించిన అంచనాలపై ఎలాంటి సర్వీస్ చార్జీలు, క్వాలిటీ కంట్రోల్ చార్జీలు వసూలు చేయరు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తారు.
ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఇద్దరు క్రియాశీలకంగా ఉండే పూర్వ విద్యార్థులు, గ్రామ సర్పంచ్, ఇద్దరు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు. వీరు దాతలతోపాటు సీఎస్సార్ నిధులను సమీకరిస్తారు. దాతలు, సీఎస్సార్ నిధులను వినియోగించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తీయాలి. ఈ ఖాతాను ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ, పూర్వ విద్యార్థుల సంఘంలోని ఇద్దరు క్రియాశీల సభ్యులు నిర్వహిస్తారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ ఖాతా నిధులను వినియోగించాలంటే జిల్లా కలెక్టర్ల ఆమోదం తప్పనిసరి.