జోగులాంబ గద్వాల : గద్వాల( Gadwal) జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ విభేదాలు రోడ్డున పడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల తీరుపై జిల్లా స్థాయిలో తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ( Sarita Tirupataiah ) పార్టీకి చెందిన నాయకులపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే గద్వాలలో మాత్రం రాజకీయ వ్యభిచారం నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెస్కు చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులను అవమాన పరిచిన గద్వాల ప్రాంత నాయకులకు ప్రాదాన్యం ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తనపై ఆశలు పెట్టుకొన్న అభ్యర్థులను గెలిపించుకుంటానని స్పష్టం చేశారు.
బహుజన బిడ్డను అణగదొక్కడానికి కుయుక్తులు పన్నిన శక్తులపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. పూటకో మాట మార్చే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ( MLA Bandla Krishna Mohan Reddy) ఏ పార్టీలో ఉన్నారో ఎవరికి ఇంకా తెలియదని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాంలు అందజేయడం శోచనీయమని అన్నారు. పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడిండ్రో రాష్ట్ర నాయకులకు తెలుసు అని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. కొందరి బీ-ఫాంలు ఇచ్చి క్యాన్సల్ చేసి ఎమ్మెల్యేకు ఇవ్వడం పట్ల ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.