జనగామ, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా.. అసమర్థ, అవగాహన లేని పాలకుల వల్ల దేవాదుల రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మంగళవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సాగునీటి అవసరాలను గుర్తించిన కేసీఆర్.. నాటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను విస్తరించి ఎండాకాలంలోనూ మత్తళ్లు దుంకేలా రైతులకు సాగునీరు అందిస్తే.. వ్యవసాయం, పంటల సాగుపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ సర్కారు దేవాదుల నీటి విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నదని మండిపడ్డారు.
నీళ్లు లేక డెడ్ స్టోరేజీకి చేరుకొని కళావిహీనంగా కనిపిస్తున్న రిజర్వాయర్లు, ఎండిపోతున్న పంట పొలాలపై రోజూ పత్రికల్లో కథనాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని వాపోయారు. తెలంగాణ నీటిని ఆంధ్రా ముఖ్యమంత్రి దోచుకుపోతుంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలకులకు సోయిలేదని ఫైర్ అయ్యారు. నీటి పారుదల వ్యవస్థ, రైతుల అవసరాలపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించని మంత్రులు ఉండటం ప్రజల దౌర్భాగ్యమని పొన్నాల విమర్శించారు.
జనగామ జిల్లాకు వరప్రదాయిని వంటి దేవాదుల రిజర్వాయర్లలోకి నీటిని వదిలేందుకు ఫేస్-1లో ఒక్క పంపు నడిపిస్తే ఎలా సరిపోతుందని? ఎన్నిరోజులకు నిండుతాయని? అప్పటి వరకు పంటలు ఎండిపోవా? నారు ముదిరిపోదా? అని రైతులు ప్రశ్నిస్తున్నా.. ఈ ప్రభుత్వం కదలడం లేదని దుయ్యబట్టారు. కోదండరాం ఏ సబ్జెక్టులో ప్రొఫెసర్? ఆయనకు, నీటిపారుదల వ్యవస్థకు ఏం సంబంధం? ఆయన ఏమన్నా.. నీటిపారుదల రంగ నిపుణుడా? వస్తాడు ఏదో చెప్తాడు.. అసలు వ్యవస్థ ఎటుపోతుంది? అని ఫైర్ అయ్యారు.
నీళ్లు ఇవ్వకుంటే ఉద్యమం: ఎమ్మెల్యే పల్లా
జనగామ పట్టణ ప్రజలకు తాగునీరు అందించే రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరిందని, తాను వెళ్లి పరిశీలించి అధికారులను నిలదీస్తే తప్ప నీటి విడుదలకు మోక్షం లభించేలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి విమర్శించారు. ఇప్పటికీ గండిరామారం, తపాస్‌పల్లి, బొమ్మకూర్ రిజర్వాయర్ల కింద 40 శాతం కూడా నాట్లు పడలేదని, నార్లు ముదిరిపోతున్నాయని పేర్కొన్నారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయ్.. మోటర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయ్.. ఎందుకు మిగతా పంపులు రన్ చేయడం లేదో అర్థం కావడంలేదని పల్లా మండిపడ్డారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని రిజర్వాయర్లను దేవాదుల నీటితో నింపకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని పల్లా హెచ్చరించారు.