హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ‘రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో మోపిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. ఆయనపై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్‌మీడియా ట్రోలింగ్స్‌ను ఆపాలి’ అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్దారక భవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘ప్రొఫెసర్ కే నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడికి వ్యతిరేకంగా’ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తొలుత సభికులతో భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించుకుంటామని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పార్టీలు, వారి సోషల్ మీడియా బృందాలు చేస్తున్న కక్షపూరిత దాడి, ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండిస్తూ అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. భావప్రకటన స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్య మనుగడే సా ధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
రాజకీయాల కోసం కొందరు అస్తిత్వవాదానికి, ప్రాంతీయవాదానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రగల్చడం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. ‘సిరాచుక్క ఇంకేవరకు నేను రాస్తూనే ఉంటా.. గొంతు ఉన్నంతవరకు మాట్లాడుతా’ అని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ పునరుద్ఘాటించారు. గత 15 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రజా సమస్యలను పకనబెట్టి తన చుట్టూనే చర్చలు నడుపడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటివారని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని కూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రాంతీయవాదాన్ని జా తీయ భద్రతా సమస్యగా లేదా ఉగ్రవాదం తో పోల్చే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్ పేరొన్నారు.