వికారాబాద్, జనవరి 2 : వచ్చే ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్(vikarabad) జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar )అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవనములో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజులలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి అన్నలా ఉండి జిల్లాను అభివృద్ధి పరుస్తానని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు. రేషన్ కార్డుల తర్వాత ఎన్నికలకు ముందు చెప్పినట్లు 6 గ్యారంటీలను అమలుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వికారాబాద్ నియోజకవర్గ ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.