హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLAs Disqualification) విచారణకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మూడు నెలల్లోగా విచారించి నిర్ణయం వెళ్లడించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యే విచారణను పూర్తిచేసిన స్పీకర్.. తాజాగా ఈ నెల 6 నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ అనర్హతపై విచారణ చేపట్టనున్నారు.
నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లను విచారిస్తారు. ఈ నెల 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని విచారించనున్నారు. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు.
కాగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు గత నెల 31న ముగిసిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.