కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి నిర్మాణం నా ఆశయం. సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి ఇన్ని ఇండ్లు మంజూరు కాలేదు. అవసరమైతే మరో 5 వేల ఇండ్లను మంజూరు చేయించి, విడతల వారిగా పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తాను. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలను సహించను. అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
బాన్సువాడ పట్టణంలో రూ. 5.47 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఉచితంగా చేప విత్తన సరఫరా, చేపల విక్రయాల కోసం మార్కెట్లు నిర్మాణం, సబ్సిడీపై వాహనాలు అందిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకుని బాగుపడాలి. దళారులు, మధ్యవర్తులను దగ్గరకు రానీయొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం, పట్టణ ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు, సౌకర్యాల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాం అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రూ. 30 లక్షలతో నూతనంగా నిర్మించబోయే పోలీసు షాపింగ్ కాంప్లెక్స్ కు స్పీకర్ భూమిపూజ చేశారు. రూ. 2 కోట్లతో బాన్సువాడ నూతన పురపాలక సంఘం భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన, రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఎమ్మార్వో భవనానికి శంకుస్థాపన, రూ. 2 కోట్లతో నూతన వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. రూ. 67 లక్షలతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబందు అధ్యక్షుడు అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.