బాన్సువాడ, మే 4: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం ఆయన ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తరలింపుపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో మాట్లాడారు. సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంటాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సొసైటీ సిబ్బందితో ఆరా తీశారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, త్వరగా కాంటాలు ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు తరలించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
ఢిల్లీలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఇందేవార్ పాండేను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి పోచారం కలిశారు. బాన్సువాడ నియోజకవర్గానికి 43 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు పాండే సానుకూలంగా స్పందించారు.