హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్గ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. భేటీలో ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అయితే, ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని కోరాయి. రోజురోజుకు సమావేశాలు నిర్వహించే రోజులు తగ్గుతున్నాయని కాంగ్రెస్, మజ్లిస్ పేర్కొన్నాయి. అయితే, పని దినాలు తగ్గినా.. పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయని, బిజినెస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనంతో పాటు తెలంగాణ జాతీయ సమైక్య ఉత్సవాల దృష్ట్యా సమావేశాలు ఎక్కువ రోజులు సభను నిర్వహించలేకపోతున్నామని మంత్రులు పేర్కొన్నారు. అవసరమైతే శీతాకాల సమావేశాలను మరోసారి 14 రోజుల పాటు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తామని మంత్రులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని కాంగ్రెస్, మైనారిటీలు, హైదరాబాద్ సమస్యలపై చర్చించాలని ఎంఐఎం కోరింది. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు పేర్కొన్నారు. సమావేశాల్లో పలు బిల్లులతో పాటు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గతంలో వాయిదాపడ్డ శాసనసభా సమావేశాలకు కొనసాగింపుగా.. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన అనంతరం తుంగుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. ఇద్దరి మృతికి సంతాపం పాటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. అలాగే శాసన మండలి సైతం సమావేశం కాగా.. ఇటీవలి గోదావరి వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించినా ఒక్కపైసా సాయం చేయలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ను అక్కడకు పంపి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో భారీ వరదలు వచ్చినా, వర్షాలు కురిసినా ఒక్కరూ చనిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 35 సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురిశాయని, 135శాతం వర్షాపాతం నమోదైందన్నారు. కాళేశ్వరం పంపులు నీట మునిగిన మాట వాస్తవమేనన్న ఆయన.. 2009లో శ్రీశైలంలో వరదలు వచ్చిన సమయంలో విద్యుత్ ప్రాజెక్టు మునిగిపోయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. వరదలు వచ్చిన సమయంలో కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.