సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): హైటెన్షన్ (హెచ్‌టీ) కనెక్షన్లపై ఎస్పీడీసీఎల్ బిల్లుల భారం మోపడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో కరెంట్ చార్జిలు పెంచేది లేదంటూ చెప్పిన డిస్కం.. పరోక్షంగా బిల్లుల భారం మోస్తున్నట్లుగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హెచ్‌టీ కనెక్షన్లున్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై ఈ భారం పడే అవకాశమున్నట్లుగా తెలుస్తున్నది. వాస్తవలోడు కన్నా అధిక లోడ్ వాడుతున్నారంటూ అందుకు తగినట్లుగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నది. బిల్లుల మోత లేదంటూనే కొత్త విధానంలో బిల్లులను లెక్కించి ఒక్కో కనెక్షన్‌పై వేలాది రూపాయల భారం మోపడానికి సిద్ధమవుతున్నది.
హెచ్‌టీ కనెక్షన్లు వినియోగిస్తున్న కరెంట్‌ను కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్) విధానంలో ఇన్నాళ్లూ లెక్కించేది. కాగా ఇప్పుడు కొత్త విధానంలో కిలో ఓల్ట్ యాంపియర్ రియాక్టివ్ అవర్(కేవీఏఆర్‌హెచ్) విధానంలో లెక్కిస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెప్పారు. కేవీఏఆర్‌హెచ్ విధానంలో ఒక హెచ్‌టీ కనెక్షన్రోజూ వినియోగించే కరెంట్ వాస్తవలోడ్ ఎంత అనేది పరిశీలించి ఆ ఓల్టేజ్ ప్రకారం యూనిట్లను లెక్కిస్తారు. దీంతో నెలవారీ బిల్లులు భారీగా పెరగనున్నాయి. అదే కేడబ్ల్యూహెచ్లో లెక్కిస్తే ఒక పరిశ్రమ వాస్తవంగా వినియోగించిన కరెంట్ కంటే తక్కువ యూనిట్లకు బిల్లులు వస్తున్నాయనేది దక్షిణ డిస్కం చెబుతుండగా.. తాము వాడుతున్న కరెంట్‌కే డబ్బులు చెల్లిస్తున్నామని, కొత్తవిధానాలు తీసుకొచ్చి ఆర్థిక భారం మోపుతున్నారంటూ పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కేవీఏఆర్‌హెచ్ విధానానికి సంబంధించి ఇండక్టివ్ రియాక్టివ్ ఎనర్జీ ల్యాగ్, కెపాసిటివ్ రియాక్టివ్ ఎనర్జీ లీడ్ అనే రెండు రకాలుంటాయి. వేర్వేరు సమయాల్లో ఆయా కనెక్షన్లపై పడుతున్న కరెంట్లోడ్ ప్రకారం ల్యాగ్, లీడ్ అనే పేర్లతో వీటిని వ్యవహరిస్తుంటారు. ఈ రెండింటినీ కలిపి మీటర్లలో లెక్కించి ఆ కనెక్షన్ పై వాడిన కరెంట్ ఎన్ని యూనిట్లనేది లెక్కించి నెలవారీ బిల్లులు జారీ చేయాలని, కానీ అలా కాకుండా కేవలం ల్యాగ్‌ను మాత్రమే లెక్కించి బిల్లులు ఇచ్చామని, అలా చేయడం వల్ల నష్టాలు వస్తున్నాయని ఈఆర్సీకి డిస్కం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీనివల్ల వాస్తవ ఓల్టేజ్ తేలక విద్యుత్ సరఫరాలో అంతరాయాలేర్పడుతున్నాయంటూ చెప్పారు.
హెచ్‌టీ కనెక్షన్లలో వాడుతున్న కరెంట్ ఓల్టేజిని తెలిపే పవర్ఫ్యాక్టర్ ఎప్పుడూ 0.95 ఉండేలా కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ చాలా కనెక్షన్లలో పీఎఫ్ తక్కువగా నమోదవుతున్నట్లుగా డిస్కం గుర్తించింది.ఇటీవల నగర శివార్లలోని ఒక పరిశ్రమకు సగటు పీఎఫ్ లోడు 0.06 మాత్రమే ఉన్నట్లు గుర్తించిన డిస్కం.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల 190 హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించి అదనపు కరెంట్ వినియోగమవుతున్నట్లు గుర్తించింది. ఏ హెచ్‌టీ కనెక్షన్ అయినా రెండు నెలల పాటు పీఎఫ్ 0.95 కన్నా తక్కువ లోడు వినియోగిస్తే తర్వాత మూడు నెలల్లోగా దానిని 0.95 స్థాయికి తెచ్చేలా వినియోగం ఉండాలని ఇందుకోసం కెపాసిటర్లను అమర్చుకోవాలని డిస్కం అధికారులు సూచిస్తున్నారు. మూడునెలల్లోగా ఖచ్చితంగా కెపాసిటర్లు అమర్చుకోవాలని, లేకుంటే వాస్తవ కరెంట్ వినియోగాన్ని గుర్తించి బిల్లులు జారీ చేస్తామంటూ వినియోగదారులకు నోటీసులు ఇచ్చింది.