సూర్యాపేట: పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట (Suryapet) జిల్లా పెన్పహడ్ పీఎస్‌లో విధుల విషయంలో ఇద్దరు పోలీసులు గొడవపడ్డారు. కానిస్టేబుల్ రవి నాయక్, హోంగార్డు శ్రీనివాసులు మధ్య డ్యూటీ విషయమై ఇటీవల తగాదా జరిగింది. విషయం బయటికి పొక్కడంతో జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇక హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ జటావత్ కిరణ్(36) కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన అతడు నిత్యం భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు ముందుగానే లీవ్ పెట్టాడు. బుధవారం ఉదయం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వారిని బయటకు పంపి తలుపులు వేసుకుని ఉరేసుకున్నాడు.
అదేవిధంగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తన భార్యతో సీఐ డానియేల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నల్లగొండ ఎస్పీ రమేశ్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు. జ్యోతి అనే మహిళ నల్లగొండ టాస్క్‌ఫోర్స్‌లో ఎస్సైగా పనిచేస్తున్న తన భర్త మహేందర్ ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని, తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఇద్దరు పిల్లలతో కలిసి కలేక్టరేట్ వద్ద ధర్నాకు దిగింది.
అదేవిధంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శ్రితితోపాటు కంప్యూటర్ ఆపరేటర్ గతేడాది డిసెంబర్ 26న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిమధ్య సాన్నిహిత్యమే బలవన్మరణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గతేడాది సెప్టెంబర్‌లో జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సై అశోక్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలతోనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎస్సై కూడా సస్పెండ్ అయ్యారు. ఇలాంటి ఘటనలు వరుసగా బయటపడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, భూవివాదాలతో పోలీసు శాఖ సతమతం అవుతున్నది.