జయశంకర్ భూపాలపల్లి, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక దోపిడీపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ తరలింపు, ఓవర్ లోడ్, అతి వేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఎస్పీ కిరణ్ కరె ప్రత్యేకదృష్టి సారించారు. ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో శనివారం ‘ఇసుక దోపిడీ.. రోజుకు 30 లక్షలు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎస్పీ జిల్లాలో ఇసుక దోపిడీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌తో తనిఖీలను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, కొయ్యూరులో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో కాటారంలో 8, భూపాలపల్లిలో 5 మొత్తం 13 లారీలు ఓవర్‌లోడ్‌తో పట్టుబడ్డాయి. ఒక్కో లారీలో పరిమితికి మించి అదనంగా 10 టన్నులకుపైనే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.
13 లారీలను సీజ్ చేసిన పోలీసులు లారీ డ్రైవర్లు, ఓనర్లపై కేసులు నమోదు చేశారు. జిల్లాలోని కాటారం, మహదేవ్పూర్ మండలాల్లో ఇసుక క్వారీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం పరిధిలో మద్దులపల్లి (పలుగుల-7), అన్నారం కామన్ క్వారీ, అన్నారం బరాజ్ అప్‌స్ట్రీమ్ క్వారీ, పుస్కుపల్లి (కొల్లూరు 2), పలుగుల-5, పలుగుల 8, పలుగుల-11, పుస్కుపల్లి (పలుగుల-6), మహదేశపూర్ పరిధిలోని పెద్దంపేట క్వారీల నుంచి మొత్తం రోజుకు సుమారు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది.
రోజుకు సుమారు 700 లారీలు ఇక్కడి నుంచి ఇసుకను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నగరాలకు తరలిస్తుంటాయి. లారీలు భూపాలపల్లి, కొయ్యూరు మీదుగా తరలివెళ్తుంటాయి. దీంతో పోలీసులు కొయ్యూరు, భూపాలపల్లిలోని జెన్కో వద్ద ప్రత్యేకంగా ఆదివారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్కడే ఉన్న వేబ్రిడ్జిల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన తనిఖీలను పోలీసులు షిప్టుల వారీగా కొనసాగిస్తున్నారు. ఒకేరోజు మొత్తం రెండు చెక్‌పోస్టుల వద్ద 13 ఓవర్ లోడ్ లారీలను సీజ్ చేసి కేసులు పెట్టారు. నిత్యం చెక్‌పోస్టులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.