నవాబ్‌పేట, నవంబర్ 16 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం చౌడూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భూముల కబ్జాకు పాల్పడుతున్న ఘటనను ఎస్పీ ధరావత్ జానకి సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. ‘కాస్తులో ఉన్నా.. కాంగ్రెసోళ్లు కబ్జా చేసిండ్రు’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ స్పందించారు. సర్వే నంబర్ 340, 341లోని 12 ఎకరాలను 1977లో కొనుగోలు చేసిన నాటి నుంచి కాస్తులో ఉన్నా.. కొంతమంది అధికార పార్టీ నాయకులు కబ్జాకు యత్నించిన తీరుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంబంధిత నిఘా వర్గాలతోపాటు పోలీస్ అధికారులను సైతం భూమికి సంబంధించిన నివేదిక కోరినట్టు సమాచారం. ఈ విషయమై సమగ్ర సమచారం కోసం పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించి ఎస్పీకి నివేదిక కూడా పంపినట్టు తెలిసింది. ఇదిలావుండగా.. ‘నమస్తే’ కథనంపై అధికార పార్టీ నాయకుల్లో ఒకింత అలజడి మొదలైంది.
శనివారం కూడా మళ్లీ బాధిత రైతుల భూముల్లో కడీలు పాతేందుకు నాయకులు, కొంతమందిని వెంట వేసుకొని వెళ్లారు. ఈ క్రమంలో కడీలు పాతకుండా పలువురు రైతులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. సర్వే చేసి తమ భూమిని చూయించిన తర్వాతే కడీలు పాతాలని తేల్చిచెప్పడంతో.. కడీలు పాతకుండానే నాయకులు వెనుదిరిగారు.