హైదరాబాద్/ఆదిలాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో సోయాబీన్ ధర భారీగా పడిపోయింది. మద్దతు ధర క్వింటాలుకు రూ. 4892 ఉండగా మార్కెట్లో కేవలం రూ. 3500 నుంచి రూ. 4వేల లోపే ధర పలుకుతున్నది. ఎన్నికల సమయంలో పంట మద్దతు ధరకు అదనంగా రూ.450 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బోనస్ సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వెనకంజ వేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోయాబీన్ ధరలు పడిపోవడంతో పంట కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర నిబంధనల ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 25శాతం అనగా 56,550 టన్నుల సోయాబీన్ కొనుగోలుకు ఆదేశించింది. పంట కొనుగోలుకు మార్క్ఫెడ్ మొత్తం 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు 13 కేంద్రాలు ప్రారంభించి 50 టన్నుల సోయాబీన్ కొనుగోలు చేశారు. ఈ సీజన్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు కాగా 2.60 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం 56వేల టన్నులు మాత్రమే కొనుగోలుకు ఆదేశించింది. అంటే మిగిలిన 2.04 లక్షల టన్నుల పంటను ఎవరు కొనుగోలు చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. వాస్తవానికి మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
ఎన్నికలకు ముందు సోయాబీన్ పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. నిరుడు మద్దతు ధర రూ. 3950 ఉండగా కాంగ్రెస్ పార్టీ రూ. 4400(రూ. 450 లేదా 11 శాతం బోనస్)లకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ప్రస్తుతం సోయాబీన్ మద్దతు ధర రూ. 4892గా ఉండగా అదనంగా రూ. 450 బోనస్ కలిపి రూ. 5342కు కొనుగోలు చేయాలి. ఒకవేళ శాతం ప్రకారం లెక్కిస్తే రూ. 5430 ధరకు కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వం ఏ ధరకూ కొనుగోలు చేయడం లేదు. అంతేగాక అసలే ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులపై ప్రభుత్వం పిడుగు వేసింది. ఎకరాకు 6.52 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ క్యాప్ నిబంధనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కోతలు, క్యాప్ పెట్టకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేను ఆరెకరాల్లో సోయా సాగు చేశా. ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగా వచ్చింది. ఆరెకరాల్లో 65 క్వింటాళ్ల పంట తీశా. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సోయాను అమ్మకానికి తీసుకొచ్చా. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరాకు ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామని కొనుగోలు కేంద్రం సిబ్బంది అంటున్నారు. ఈ లెక్కన నేను 40 క్వింటాళ్ల పంటను మాత్రమే విక్రయించే అవకాశం ఉంది. మిగిలిన ఉత్పత్తులను ప్రైవేటు వ్యాపారులకు అమ్మాలి. సర్కారు నిర్ణయంతో రూ.22 వేలు నష్టపోవాల్సి వస్తున్నది.
నాలుగెకరాల్లో సోయా వేశా. 40 క్వింటాళ్ల పంటను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. ఇక్కడ ఎకరానికి ఆరున్నర క్వింటాళ్లు మాత్ర మే కొంటామని అంటున్నారు. ఈ లెక్కన ఇంకా 15 క్వింటాళ్లు మిగులుతుంది. ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే రూ.14 వేల నష్టం వస్తుంది. మార్కెటింగ్ సిబ్బంది 13 శాతం తేమ ఉన్నా పంటను తీసుకోవడం లేదు.