హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని, 16 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయని వివరించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జనగామ, ములుగు జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని, ఫలితంగా ఈ నెల 26 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 26న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.