హైదరాబాద్, జూన్ 15 (నమస్తేతెలంగాణ) : నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఇక రానున్న రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్,వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 11 జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 42.5 డిగ్రీలు నమోదైనట్టు పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు.
ఎల్నినో ప్రభావం దేశంపై చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4 నుంచి జూన్ 15 వరకు దేశంలో సాధారణంగా కురువాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి బదులుగా కేవలం 19.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ లెకన చూస్తే 64శాతం వర్షపాతం తగ్గిపోయింది. జూన్ 15న ఇన్సాట్ -3డీఎస్ ద్వారా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో చురుకైన రుతుపవనాలకు సాధారణంగా ఉండే విసృ్తతమైన మేఘాల ఆవరణకు భిన్నంగా, నిర్మలంగా కనిపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. హిమాలయాలు, ఈశాన్య భారతదేశం, సింధు-గంగా మైదానాలకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా మేఘాల కదలికలు కనిపిస్తుండగా, అరేబియా సముద్ర శాఖ మాత్రం బలహీనంగా, విడిపోయినట్టుగా కనిపిస్తున్నదని తెలిపారు. ఈ వారం చివరలో ఇవి క్రమంగా మెరుగుపడుతాయని అంచనా నమూనాలు సూచిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ఈనెల 18 నుంచి 21 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.