Monsoon : ఈసారి తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే రుతుపవనాల రాక 4 నుంచి 5 రోజులు ఆలస్యం కానుంది. ఈ నెల 26న కేరళ (Kerala) ను తాకనున్న రుతుపవనాలు, ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు (Andaman Nocobar Islands), బంగాళాఖాతం (Bay of Bengal), అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇవి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలావుంటే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం అదిలాబాద్‌లో అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం జోగులాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.