Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నవంబర్ వరకు పొడిగినట్లు చెప్పింది. చర్లపల్లి-తిరుపతి (07013) రైలు సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. రైలు ఆయా రోజుల్లో రాత్రి 9.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని చెప్పింది.
తిరుపతి-చర్లపల్లి (07014) రైలు సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం రాకపోకలు సాగిస్తుందని.. ఆయా రోజుల్లో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని వివరించింది. రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్, కంభం, గిద్దలూరు, నంద్యాల, కోయికంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్, యెర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నందలూర్, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్లు ఉన్నాయని.. అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చని వివరించింది.